
హైదరాబాద్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళా వేధింపుల కేసును మాఫీ చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఏఎస్సై.. కోర్టు ప్రాంగణంలోనే అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో బాలయ్య ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోర్టు డ్యూటీలో ఉన్నారు. అయితే చైతన్యపురి స్టేషన్‌లో పల్లపు రాంబాబు అనే వ్యక్తిపై క్రైమ్ నంబర్ 363/2025 కింద ఒక మహిళా వేధింపుల కేసు నమోదైంది.ఈ కేసు విషయంలో ఇరుపక్షాలు రాజీ పడ్డప్పటికీ.. రంగారెడ్డి జిల్లా కోర్టులోని లోక్ అదాలత్‌లో ఈ కేసును పూర్తిగా మూసివేయించాలంటే తనకు 15 వేల రూపాయల లంచం ఇవ్వాలని ఏఎస్సై బాలయ్య డిమాండ్ చేశాడు.
బాలయ్య వేధింపులు భరించలేక బాధితుడు రాంబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ ఏర్పాటు చేశారు. బుధవారం కోర్టు ప్రాంగణంలోనే రాంబాబు నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏఎస్సై బాలయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అనంతరం బాలయ్యను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. పోలీస్ శాఖలో ఉంటూ కోర్టు ప్రాంగణంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.