
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కార్యాలయానికి బుధవారం బాంబు బెదిరింపు వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో భద్రతా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. మేయర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఇమెయిల్ పంపిన వ్యక్తి.. ‘ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ’ అని పిలుచుకునే ఓ గ్రూపునకు చెందినవాడిగా పేర్కొన్నాడు.
బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు, భద్రతా బృందాలను అప్రమత్తం చేశారు. మేయర్ కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఇమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ స్పెషలిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.