Reading Time: 4 minutes

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీలలో అసోంలో మాత్రమే బిజెపి సొంతంగా అధికారంలో ఉంది. పుదుచ్చేరిలో అధికార కూటమిలో భాగస్వామి అయినప్పటికీ అక్కడ సొంతబలంపై నిలబడే అవకాశం లేదు. అసోంలో అధికారం నిలబెట్టుకొని, వరుసగా మూడోసారి అధికారం పొందేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో మొదటిసారి ఏదిఏమైన్నప్పటికీ అధికారం చేపట్టాలని బిజెపి నాయకత్వం పట్టుదలతో పనిచేస్తున్నది. తమిళనాడు, కేరళలలో సైతం సొంతంగా అధికారం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో తన ప్రాబల్యం ఆ రాష్ట్రాలలో పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, బిజెపి నాయకత్వం ప్రస్తుతం తన దృష్టిని రాజకీయ ప్రత్యర్థులపైకన్నా సొంతపార్టీ నేతలు కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా చేయడంపైనే సారించాల్సి వస్తుంది. ఈ రాష్ట్రాలలో దశాబ్దాలనుండి సమీప భవిష్యత్తులో అధికారం దక్కే అవకాశాలు కనిపించకపోయినా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులు, కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చేస్తున్న నాయకుల మధ్య ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్నాయి.

నాలుగు రాష్ట్రాలలో కూడా పార్టీకి నేతృత్వం వహిస్తున్నది కొద్దికాలం క్రితం పార్టీలో చేరిన నాయకులే కావడం గమనార్హం. అసోంలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చుట్టూ పార్టీ తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంది బిజెపి- కాంగ్రెస్ మధ్య కాదని, శర్మ నేతృత్వంలోని బిజెపి, తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్య అంటూ రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. తనను బిజెపిలోకి తీసుకొచ్చిన నాయకుడితో సహా దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన 15 మంది సిట్టింగ్ ఎంఎల్‌ఎలకు ఈ సారి బిజెపి సీట్లు లభించలేదు. పైగా, ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులను అందలం ఎక్కిస్తున్నారు. 36 మంది కాంగ్రెస్ నాయకులు బిజెపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దానితో ఓ మహిళా మంత్రితో సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఓ సీనియర్ బిజెపి నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

పదేళ్లుగా అధికారంలో ఉండడంతో అవినీతి, నిరుద్యోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎక్కువగా గౌహతి చుట్టూ కేంద్రీకృతం అవుతుందనే విమర్శలు సైతం కొన్ని ప్రాంతాలలో సమస్యలు సృష్టిస్తున్నాయి. దేశం మొత్తం బిజెపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నలలో బిజెపి నడుస్తుండగా, అసోంలో మాత్రం సిఎం శర్మ ‘సూపర్ బాస్’గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర నాయకులు సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితులు ఏర్పరచుకున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లో సైతం ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుడిభుజంగా వ్యవహరించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ సైతం పార్టీ సీనియర్ నాయకులు పలువురికి సీట్లు లభించకపోవడంతో పలు చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ సీట్లను అమ్ముకున్నారని అంటూ సీనియర్ నాయకులపై బహిరంగంగానే ఆరోపణలు చేయడంతో పార్టీని ఇరకాటంలోకి నెట్టివేసి పరిస్థితులు నెలకొన్నాయి.

ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లు తొలగించామని, ఇక తమను అధికారంలోకి తీసుకురాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమాతో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి నమ్మకస్తుడైన గవర్నర్ ఆర్‌ఎన్ రవిని తమిళనాడు నుండి ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకొచ్చి, ఎన్నికల ప్రకటన రాగానే రెవెన్యూ, పోలీసు అధికారులను భారీగా మార్చివేశారు. ప్రజలను గెల్చుకోవడం ద్వారా కాకుండా అధికార యంత్రంగం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొన్నది. సుప్రీం కోర్టు జోక్యంకు కూడా దారితీసింది. ఎన్నికల కమిషన్‌పై మమత ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు స్థానిక బిజెపికి నేతల నుండి ఎక్కువగా సమాధానాలవుతున్నాయి. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను ఆమె ప్రోత్సహిస్తూ, వారిని ఓటర్లుగా మార్చుకున్నారని, వారి పేర్లు తొలగించే ప్రయత్నంతోనే ఆమె ఆడుకుంటున్నారని ప్రచారం ప్రారంభించారు.

గత ఏడాది బీహార్‌లో సైతం ఇటువంటి ప్రచారమే చేశారు. విదేశీ ఓటర్లను తొలగిస్తుంటే ఆర్‌జెడి అడ్డుకుంటుందని ప్రచారం చేశారు. అయితే, ఎంతమంది విదేశీ ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారంటే సమాధానం లేదు. కేవలం 230 మందిని మాత్రమే తొలగించారని, వారు సైతం నేపాల్ నుండి వివాహబంధం కారణంగా బీహార్‌కు వచ్చినవారిని చివరకు తేలింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు బెంగాల్‌లో గుర్తించిన బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య బిజెపి పాలిత త్రిపురతో పోల్చుకుంటే నామమాత్రంగా ఉంది. ఈ సందర్భంగా అమిత్ షా టిఎంసి పాలనపై ఓ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అయితే తనను ‘బెంగాల్ కుమార్తె’ను అంటూ చెప్పుకుంటున్న మమతా బెనర్జీని ఎదుర్కోవడంలో బలమైన నాయకత్వం బిజెపిలో కనిపించడం లేదు. స్టార్ హోటల్స్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సర్దుబాటు చేసుకుని, పార్టీ పాత- కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం ఓ పెద్ద సవాల్‌గా కనిపిస్తుంది. మరోవంక, తమిళనాడులో బిజెపి అస్తిత్వ సమస్యలు ఎదుర్కొంటున్నది. డిఎంకె వ్యతిరేక శక్తులు అన్నింటినీ ఎన్‌డిఎ పరిధిలోకి తీసుకొచ్చి ఎంకె స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్రయత్నాలు ఎన్నికల ముందే వికటించాయి.

అందుకనే ఆ రాష్ట్రం ఎన్నికలపై పెద్దగా ఆశలు కనిపించక పోవడంతో అక్కడి గవర్నర్ రవిని ఎన్నికలు జరుగుతున్న మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు మార్చారు. బలవంతంతో బిజెపితో సీట్ల సర్దుబాటుకు అన్నాడిఎంకె అధినేత కె పళనిస్వామిని ఒప్పంచగలిగినా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బిజెపి ఎంతగా ఒత్తిడులు తీసుకొచ్చిన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం, శశికళ వంటి వారిని ఎన్‌డిఎ పరిధిలోకి తీసుకువచ్చేందుకు పళనిస్వామి ఒప్పుకోలేదు. దానితో గత్యంతరంలేక పన్నీరుసెల్వం డిఎంకెలో చేరిపోయారు. శశికళ సొంతదారి చూసుకున్నారు.

పన్నీరుసెల్వంతో పొత్తుకోసం తమిళనాడులో బిజెపిని ఉధృతమైన రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలైను పక్కనపెట్టాల్సి వచ్చింది. దానితో తండ్రి అనారోగ్యం అంటూ ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉంటున్నారు. చివరకు ఎన్నికల పొత్తులో అన్నామలై పోటీ చేసేందుకు సీట్ కూడా దొరికే పరిస్థితి లేదు. సీట్ల సర్దుబాటులో సైతం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా పళనిస్వామి తెలివిగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు లేని సీట్లను ఎక్కవుగా బిజెపికి వదిలారనే అన్నామలై మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక, సినీ నటుడు విజయ్ పై ఒత్తిడి తీసుకొచ్చి, టివికెను ఎన్‌డిఎలోకి తీసుకొచ్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకోసం విజయ్ సినిమా విడుదల కాకుండా సెన్సార్ బోర్డు ద్వారా అడ్డంకులు కల్పించినా, తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు పేరుతో టివికె నేతలను సిబిఐ పలుసార్లు విచారణకు పిలిచినా ఫలితం లేకపోయింది. గతంలో అన్నాడిఎంకెలో కీలక నేతగా ఉన్న నైనర్ నాగేంద్రన్ ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కావడం గమనార్హం. ఇక కేరళలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ కూటమి ఎక్కడ అధికారంలోకి వస్తుందనే భయంతో సిద్ధాంతపరంగా పూర్తి వ్యతిరేకులైన సిపిఎం కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి వ్యూహాత్మకంగా సహకారం అందిస్తుందని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉంచిన కేరళ పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం, ఇటీవల ప్రధాని మోడీ జరిపిన రాష్ట్ర పర్యటనలో శబరిమలకు సంబంధించిన వివాదాలపై మౌనం వహించడం పరోక్షంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు సహకారం అందించేందుకే అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము సిపిఎం- బిజెపిలను ఉమ్మడిగా ఎదుర్కొంటున్నామని రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయన్ సైతం గతంలో మాదిరిగా బిజెపిపై విమర్శల పదునును తగ్గించినట్లు కనిపిస్తున్నది. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, బిజెపి నేతృత్వంలోని కేంద్రం మధ్య ఏదైనా ‘లోపాయికారి ఒప్పందం’ ఉందన్న ఆరోపణలపై ప్రశ్నించినప్పుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘అటువంటి ఒప్పందమే గనుక ఉండి ఉంటే, 2018 లో (కేరళ వరదల సమయంలో) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వయనాడ్ కొండచరియల విపత్తు (2024) సమయంలోనైనా కేంద్రం రాష్ట్రానికి మద్దతు ఇచ్చిందా?’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.

పైగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌పై విమర్శలు గుప్పిస్తూ, ‘యుడిఎఫ్‌కు బిజెపిని వ్యతిరేకించాలంటేనే భయం. అనేక అంశాలలో వారిద్దరి సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయి. కానీ మేము (ఎల్‌డిఎఫ్) మాత్రం భిన్నం’ అని చెప్పుకొచ్చారు. సిపిఎం బిజెపి మధ్య ఒక ‘అపవిత్ర కూటమి’ ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, ‘రాహుల్ గాంధీకి చెందిన కాంగ్రెస్ పార్టీ, బిజెపికి ఒక ‘బి-టీమ్’ లాంటిది’ అని ఘాటుగా బదులిచ్చారు.