Reading Time: < 1 minute
Hyderabad Hanuman Jayanti Shobha Yatra 2026 Routes Security Guidelines

హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 2న అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే హనుమాన్ జయంతి,, ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఈ శోభాయాత్ర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ విజయ యాత్ర సుమారు 12.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రధానంగా కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం, గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. ఈ రెండు ఊరేగింపులు కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద కలుస్తాయి. అక్కడ నుంచి బేగంబజార్, సికింద్రాబాద్ మీదుగా ప్రసిద్ధ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ మహా యాత్ర కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రధాన యాత్రలో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 168 ఉప శోభాయాత్రలు కలవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

భద్రతా ఏర్పాట్లు..

నగర వ్యాప్తంగా భద్రత కోసం హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో సుమారు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. యాత్ర పొడవునా పర్యవేక్షించడానికి మూడు ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఊరేగింపు సాగే మార్గమంతా సీసీటీవీ కెమెరాల నీడలో ఉంటుంది. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి స్వయంగా కమిషనర్ పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక , సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ను రంగంలోకి దించారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ , జలమండలి అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. యాత్ర సాగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్ల క్రమబద్ధీకరణ, త్రాగునీటి సౌకర్యం మరియు ట్రాఫిక్ మళ్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఉత్సవాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. భక్తులు మరియు నిర్వాహకులు కోవిడ్ లేదా ఇతర ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.