
- ఈ నెల 11న ఆవిష్కరించనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ లో ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఈ నెల 11న పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విగ్రహాల ఏర్పాటు పనులను మంత్రి కొండా సురేఖతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.
వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను పొన్నం ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చుకున్నామని గుర్తుచేశారు. ‘జ్యోతిబా పూలే సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశారు.. సావిత్రి బాయి పూలే మహిళలు చదువుకోవడం కోసం ఉద్యమించారు.
వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు నగరం నడిబొడ్డులో దాదాపు రూ. 4 కోట్ల తో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. వారి సంస్కరణలు, సేవలు గుర్తుకుతెచ్చుకునేలా విగ్రహాలు ఉంటాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 11న ఉదయం అన్ని గ్రామాల్లో జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సాయంత్రం సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
మహనీయులు ఉన్న ఈ ప్రాంతం నేటితరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మార్గానికి పూలే మార్గ్ గా పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.