
యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను నిరంతరం ప్రవేశపెడుతున్న వాట్సాప్, ఇప్పుడు మెసేజ్‌లను చదివే విధానాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉంది. రోజువారీ పనుల బిజీలో చాలా మంది తమ చాట్‌లను, ముఖ్యంగా గ్రూప్ సంభాషణలను, సకాలంలో చూడలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా “అన్‌రీడ్ చాట్ సమ్మరీ” అనే వినూత్న ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చదవని మెసేజ్‌ల సారాంశాన్ని ఒకేసారి చూసే వీలుంటుంది. దీని వల్ల ప్రతి చాట్‌ను విడిగా తెరిచి చదవాల్సిన అవసరం తగ్గుతుంది.
ఈ ఫీచర్ ప్రత్యేకత దాని భద్రతా విధానంలో ఉంది. మెటా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ ప్రాసెసింగ్ సాంకేతికత ద్వారా, యూజర్ కోరినప్పుడు మాత్రమే చదవని కొత్త సందేశాలను ప్రాసెస్ చేసి వాటి సారాంశాన్ని రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షిత వాతావరణంలో జరుగుతుందని, మెసేజ్‌ల అసలు కంటెంట్‌ను కంపెనీ కూడా యాక్సెస్ చేయలేదని స్పష్టం చేసింది. దీంతో ఇతర AI ఆధారిత సేవలతో పోలిస్తే ఈ ఫీచర్ మరింత గోప్యతను కాపాడుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్‌గా ఉండనుంది. యూజర్లు తమకు అవసరమైన చాట్‌లకే సారాంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ ప్రాసెసింగ్ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉండి, అవసరమైతే సెట్టింగ్స్ ద్వారా ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాక, దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఎక్కువ మెసేజ్‌లు వచ్చే వినియోగదారులకు సమయాన్ని ఆదా చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి