
సీనియర్ దర్శకుడు భారతీరాజా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో చూసి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అనారోగ్యం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. భారతీ రాజాను ఇలా చూడటం తమకు చాలా ఇబ్బందిగా ఉందని.. ఆయనను ఈ స్థితిలో చూడలేకపోతున్నామని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా కనిపించిన భారతీ రాజా ఇలా హాస్పిటల్ బెడ్పై బలహీనంగా.. అలసిపోయిన స్థితిలో కనిపించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
It’s really painful to see #Bharathiraja sir like this. Truly hoping he makes a strong and full recovery and returns to good health soon. pic.twitter.com/KMe72xvtfr
— Harish M (@chnmharish) March 31, 2026
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనారోగ్యంతో బాధపడుతున్న భారతీ రాజాను ఇటీవల కలిశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో భారతీరాజాకు చికిత్స అందిస్తున్నారు. నైనార్ నాగేంద్రన్ నేరుగా ఆ హాస్పిటల్ కు వెళ్లి భారతీ రాజా ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందిలో ఒక యువతి తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దిగ్గజ దర్శకుడిని అలాంటి స్థితిలో చూడటం బాధగా ఉందని కొందరు అభిమానులు ఈ ఫొటో చూసి నిట్టూర్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భారతీ రాజా వ్యక్తిగత జీవితంలో కోలుకోలేని విషాద ఘటన జరిగింది. ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా అనారోగ్యంతో 2025 మార్చిలో అనారోగ్యంతో చనిపోయారు. కన్న కొడుకును కోల్పోయిన విషాదం ఆయను మరింత కుంగదీసింది. అప్పటి నుంచి ఆయనను అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి. తమిళ సినీ పరిశ్రమలో భారతీరాజా ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కించారు.
ఆయన దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించిన’16 వయతినిలే’ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఇదే సినిమాను తెలుగులో కె.రాఘవేంద్ర రావు ‘పదహారేళ్ల వయసు’ పేరుతో తెరకెక్కించారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. భారతీ రాజా తెలుగులో కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. ఆరాధన, సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, జమదగ్ని సినిమాలను తెలుగులో భారతీ రాజా తెరకెక్కించారు.