
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్‌ఏ)ఆధ్వర్యంలో హెచ్‌పివి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం హెచ్‌పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. హెచ్‌పివి వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి కోరారు.