Reading Time: 2 minutes

ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచే కొత్త ఐటీ చట్టం.. F&O ట్రేడింగ్‎పై పన్నుల పెంపు.. TCS రెండు శాతానికి తగ్గింపు

Caption of Image.

న్యూఢిల్లీ: సరికొత్త ఆదాయపు పన్ను చట్టం బుధవారం నుంచి అమలులోకి రానుంది. 1961 నాటి పాత చట్టం స్థానంలో దీనిని తీసుకొచ్చారు. పన్ను విధానాన్ని మరింత సులభంగా, పారదర్శకంగా మార్చడమే ఈ కొత్త చట్టం ప్రధాన లక్ష్యం. ఇక నుంచి అసెస్​మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే తేడాలు ఉండవు. వీటికి బదులుగా కేవలం ఒకే పన్ను సంవత్సరం విధానం అమలవుతుంది. 

గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినా అదనపు చార్జీలు లేకుండా టీడీఎస్ రీఫండ్ పొందవచ్చు. పాత చట్టం కింద కొనసాగుతున్న అప్పీళ్లు, ఇతర పెండింగ్ వ్యవహారాలు పాత నిబంధనల ప్రకారమే పరిష్కారమవుతాయి. స్టాక్ మార్కెట్లలో ఊహాజనిత ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ను అరికట్టడానికి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్​టీఈ) పెంచింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై పన్ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెరిగింది.

ఆప్షన్ల ప్రీమియంపై పన్ను 0.1 శాతం నుంచి 0.15 శాతానికి చేరింది. చిన్న ఇన్వెస్టర్లు భారీ నష్టాల బారిన పడకుండా రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం. విదేశీ పర్యటనలు చేసే వారికి, విదేశాల్లో విద్య, వైద్యం కోసం డబ్బు పంపే వారికి టీసీఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) నుంచి ఉపశమనం లభించింది. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ 20 శాతం నుంచి రెండు శాతానికి తగ్గింది.

 వైద్యం, విద్య కోసం విదేశాలకు పంపే నిధులపై కూడా పన్ను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించారు.   దేశంలో డేటా సెంటర్ల రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం 20 ఏళ్ల పాటు పన్ను రాయితీ ప్రకటించింది. భారత్ నుంచి డేటా సెంటర్ సేవలు పొందే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను ఉండదు. దీనివల్ల గ్లోబల్ కంపెనీలు భారతీయ డేటా సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతాయి. 

ఈ మార్పులన్నీ 2026-–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి వస్తాయి. ఇదిలా ఉంటే, ఆదాయపు పన్ను శాఖ 2026-–27 అసెస్​మెంట్ సంవత్సరానికి సంబంధించి మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వనరులను బట్టి సరైన ఫారాన్ని ఎంచుకుని రిటర్నులు దాఖలు చేయాలి. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కంపెనీలు… ఇలా అందరికీ వేర్వేరు ఫారాలు అందుబాటులో ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.