
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా వరుస సిరీసులతో బిజీగా ఉండనుంది. తొలుత జూన్‌లో ఆఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత తలపడనుంది. ఈ మ్యాచ్‌లు స్వదేశంలోనే జరుగుతాయి. ఆ తర్వాత భారత్.. ఐర్లాండ్ టూర్‌లో భాగంగా రెండు టి-20లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఇంగ్లండ్‌తో ఐదు టి-20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన జూలై 1న మొదలై.. జూలై 19తో ముగియనుంది.
అక్కడి నుంచి మూడు రోజుల తర్వాత భారత్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య నాలుగు రోజుల వ్యవధిలో మూడు టి-20లు జరుగుతాయి. ఈ మూడు టి-20లు హరారే వేదికగా జూలై 23 నుంచి జూలై 26 మధ్య జరుగుతాయి. 2024 తర్వాత భారత్ జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం ఇదే తొలిసారి. 2027లో జింబాబ్వే భారత్‌లో పర్యటించనుంది. భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఈ వన్డేలు జనవరి 3న కోల్‌కతాలో, జనవరి 6న హైదరాబాద్‌లో, జనవరి 9న ముంబైలో జరుగుతాయి.