
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది, ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తాడనుకున్న మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే, అయితే, ఒక చిన్న షెడ్యూల్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచేందుకు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ దాదాపు ఆరు నెలల పాటు సాగడంతో, సినిమా నిర్మాణ సమయం అనూహ్యంగా పెరిగిపోయి, ముందుగా అనుకున్న కాల్షీట్లు అన్నీ తారుమారయ్యాయి.
Also Read:Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..
టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ‘డేట్స్’ సమస్యేనని తెలుస్తోంది.
నీల్ సినిమాల్లో నటించాలంటే కేవలం డేట్లు ఇస్తే సరిపోదు, ఆ పాత్ర కోసం ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం, దానికి చాలా సమయం పడుతుంది. టోవినో థామస్ మలయాళంలో ఏడాదికి అరడజను సినిమాలు చేసే బిజీ హీరో. కేవలం ఒక విలన్ పాత్ర కోసం తన చేతిలో ఉన్న లీడ్ రోల్స్ అన్నింటినీ వదులుకోవడం ఆయన కెరీర్ పరంగా రిస్క్ అని భావించినట్లు సమాచారం. గత నవంబర్‌లో ఈ విషయంపై టోవినోను ప్రశ్నించినప్పుడు “ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను” అంటూ దాటవేసినా తాజాగా ఆయన ఈ సినిమా నుండి అధికారికంగా తప్పుకుంటున్నట్లు ధృవీకరించారు. సినిమా ఎంతటి భారీ సక్సెస్ సాధించినా, ఒక నటుడిగా తన సొంత మార్కెట్‌ను కాపాడుకోవడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టోవినో తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఢీకొట్టే ఆ ‘ప్రతి నాయకుడు’ ఎవరై ఉంటారా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.