
నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.. అయితే, మేకలోని ప్రతిపార్ట్ ప్రత్యేకమైనదే.. మటన్, మటన్ లివర్, తిల్లి, కాళ్లు, తలకాయ, బోటి (పేగులు).. ఇలా అన్ని స్పెషలే.. అయితే.. మేక (Mutton) తిల్లి లాభాలు మాత్రం అపారం.. మేక తిల్లి (Goat Spleen) అత్యధిక పోషకాలున్నాయి.. ఇందులోని ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 ఎన్నో సమస్యలను నివారిస్తాయి. ఇది రక్తహీనతను, తగ్గించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, బాలింతలలో రక్తాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తిల్లి.. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి, సాధారణంగా బలహీనంగా ఉన్నవారికి తక్షణ శక్తిని, బలాన్ని అందించే అద్భుతమైన వంటకంగా పేరుపొందింది. కొన్ని ప్రాంతాలలో దీనిని నెరడు అని కూడా పిలుస్తారు. దీనిని తయారుచేయడం చాలా సులభం. ఇది కేవలం పెద్దలకే కాకుండా, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది వారి ఆరోగ్యాన్ని, బలాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. మటన్ షాపుల్లో ఇది సులువుగా లభిస్తుంది.
తిల్లి తయారీ విధానం.. ముఖ్యమైన చిట్కాలు:
ముందుగా తిల్లి (Mutton Tilli) ని శుభ్రం చేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కోసిన తర్వాత మళ్ళీ కడగకూడదు, ఎందుకంటే అలా చేస్తే అందులోని విటమిన్లు నీటిలో కలిసి పోతాయి. ముక్కలను సున్నితంగా కట్ చేయాలి, లేకపోతే అవి పాడయ్యే అవకాశం ఉంది. కత్తిపీట, చాకు లేదా కత్తెర ఉపయోగించి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చాలామంది దీనిని ఉడకబెట్టి ఆ నీటిని పారబోసి ఫ్రై చేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. అలా చేయడం వల్ల టిల్లిలోని పోషకాలు కోల్పోతారని నిపుణులు సూచిస్తారు. పది నుండి పదిహేను నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అయితే.. తిల్లిని కొద్దిగా ఉడకబెట్టి కూడా కర్రీ లేదా ఫ్రై చేసుకోవచ్చు..
ప్రత్యేకమైన తిల్లి వంట ప్రక్రియ:
1. స్టవ్ ఆన్ చేసి, పాన్ లో రెండు గరిటెల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసి వేపించుకోవాలి. ఈ ప్రక్రియ అంతా తక్కువ మంటపైనే చేయాలి, హై ఫ్లేమ్ అస్సలు వాడకూడదు.
2. జీలకర్ర, వెల్లుల్లి వేగిన తర్వాత సిద్ధం చేసుకున్న తిల్లి ముక్కలను వేసుకోవాలి. ముక్కలు వేయగానే వెంటనే గరిటతో కలపకూడదు. ఒక ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై అలానే వదిలేయాలి.
3. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు ఇష్టమైతే వాడుకోవచ్చు.. లేకపోతే లేదు.. మధ్య మధ్యలో ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి.
4. తిల్లి సగం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు (మరీ ఎక్కువ కాకుండా), అర టీస్పూన్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.
5. ఆ తర్వాత సరిపోయేంత కారం, పసుపు, ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు వాడకుండానే ఈ ఫ్రై చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది.
6. మసాలాలు వేగిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి మటన్ తిల్లి ఫ్రై సిద్ధమవుతుంది.
7. తిల్లి కర్రీని కూడా కూడా ఇలాగే చేసుకోవచ్చు.. దీనిలో టమాటా.. కొంచెం నీరు యాడ్ చేస్తే సరిపోతుంది.
నూనె కొంచెం ఎక్కువగా అనిపించినా, అది అన్నంలో కలుపుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఫ్రై కానీ, కర్రీగానీ తింటే, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..