
చండీగఢ్: ఐపిఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ .. ఈ మెగా టోర్నీలో అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఐపిఎల్ యాజమాన్యం షాకిచ్చింది. స్లో ఓవర్-రేట్ కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించారు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అయ్యర్‌కు, రూ. 12 లక్షల భారీ జరిమానా విధించారు. ఈ సీజన్ లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్ అయ్యరే.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్, తమ 20 ఓవర్లను పూర్తి చేయడానికి దాదాపు రెండు గంటల సమయం తీసుకుంది. అంతేకాకుండా, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందే టైమర్ ముగియడంతో పంజాబ్ కు పెనాల్టీ విధించారు. అయితే, అర్ష్‌దీప్ సింగ్ చివరి ఓవర్‌లో నాలుగు వైడ్‌లు, ఒక నో-బాల్ తో మొత్తం 11 బంతులు వేసాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్‌గా కూడా నిలిచింది. అర్షదీప్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు, ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 11 బంతులు వేశారు.
మ్యాచ్ విషయానికొస్తే, గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం మ్యాచ్ లోనే కేవలం 44 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కూపర్ కానలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతనితో పాటు, ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా 24 బంతుల్లో 37 పరుగులు చేసి రాణించాడు.