తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తిప్పతీగ జ్యూస్ చేదుగా ఉండవచ్చు, కానీ ఇది సర్వరోగనివారిణి.. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న తిప్పతీగ ఆకులు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఈ ఆయుర్వేద మూలిక తిప్పతీగ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరం, ఆరోగ్యంపై కలిగే సానుకూల ప్రభావాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ? అలా అయితే, ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. తిప్పతీగ రసం శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
తిప్పతీగ మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరమైనది. తిప్పతీగ ఆకుల రసంలోని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచుకోవడానికి సైతం దీని రసాన్ని తీసుకోవచ్చు.
తిప్పతీగ రసం పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తిప్పతీగ రసం తాగవచ్చు. కీళ్లనొప్పుల రోగులకు కూడా దీని రసం తాగమని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తారు.
తిప్పతీగను దీర్ఘకాలిక జ్వరాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం తీసుకోవచ్చు.. ఈ తీగ రక్త శుద్ధికి, కాలేయ ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తిప్పతీగ జ్యూస్‌ను కొంచెం పరిమాణంలో నీటితో కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ( ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి)




