
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని పంజాబ్ భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది.సెక్టార్ 37లో ఉన్న బిజెపి కార్యాలయం సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు జరిగింది. బ్యాటరీ పేలుడు కారణంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన చండీగఢ్ పోలీసులు.. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలకు సమాచారం అందించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సంఘటనాస్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశాయి.
కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (CFSL) నుండి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సాక్ష్యాలను సేకరించి, పరిస్థితిని అంచనా వేస్తోంది. పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి వారు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఫోరెన్సిక్ బృందాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.