Reading Time: 2 minutes

పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్! రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్

Caption of Image.
  • ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు
  • సీజన్​  ప్రారంభంలో రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్​
  • ఇదే అదనుగా వ్యాపారుల సిండికేట్​..మార్కెట్​లేదంటూ రేట్ల తగ్గింపు
  • నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీగా నిల్వలు.. ఆందోళనలో రైతులు

జగిత్యాల, వెలుగు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పసుపు రైతులపైనా పడింది.  భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్​ దేశాలకు ఏటా రూ.2వేల కోట్లకుపైగా విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో  ఎగుమతిదారులు కొన్నివారాలుగా ఆర్డర్లను నిలిపివేశారు. 

గతేడాది నిల్వలే పేరుకుపోగా,  సరిగ్గా ఇప్పుడే మార్కెట్లోకి కొత్త పంట భారీగా వచ్చింది. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేట్​గా మారి రేట్లు తగ్గించేస్తున్నారు. ఈ సీజన్​  ప్రారంభంలో క్వింటాల్​పసుపు రూ.13 వేలతో ప్రారంభం కాగా,  రూ.15వేల దాకా పెరుగుతుందని రైతులు ఆశించారు. కానీ, ప్రస్తుతం వ్యాపారులు క్వింటాల్​కు రూ.9 వేలు మాత్రమే పెడ్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

17 లక్షల క్వింటాళ్ల దిగుబడులు.. 
ప్రపంచ పసుపు సాగులో భారత్​కు 70 శాతం వాటా ఉంది. ఇందులోనూ తెలంగాణ వాటా 24 శాతానికి పైమాటే! మన రాష్ట్రంలో పసుపు సాగులో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉండగా, జగిత్యాల రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాలున్నాయి. ఈసారి నిజామాబాద్ జిల్లాలో సుమారు 35 వేల ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 25 వేల ఎకరాల్లో పసుపు సాగైంది. ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 

ఈ లెక్కన సుమారు 16 లక్షల నుంచి 17 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో ఇప్పటి వర కు కేవలం 3 నుంచి -4 లక్షల క్వింటాళ్ల పంట మాత్రమే అమ్ముడవగా, ఇంకా 12 నుంచి 13 లక్షల క్వింటాళ్ల పసుపు రైతుల వద్దే నిల్వ ఉంది. కొద్దిరోజులుగా రైతులు తమ పసుపును మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్, మెట్‌‌పల్లి, జగి త్యాల మార్కెట్లకు తరలిస్తూ, అక్కడి రేట్లు చూసి ఖంగుతింటున్నారు.

ఎగుమతులు డల్​.. నిల్వలు ఫుల్.. 
భారత్ అవసరాలు పోగా ఇరాన్, ఇరాక్​, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్​ కంట్రీస్​తో పాటు జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు ఏటా రూ.2వేల కోట్ల విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. కానీ పశ్చిమాసియా యుద్ధం కారణంగా రవాణా కష్టాలు పెరగడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.  గతేడాది నిల్వలకు  తోడు  కొత్త పంట వస్తుండడంతో ఇదే అదనుగా మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్, మెట్‌‌పల్లి, జగిత్యాల మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌‌గా మారారు. 

ఎగుమతులు నిలిచిపోయాయని, యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదంటూ రేటు అమాంతం తగ్గించేశారు. నిజానికి ఈ ఏడాది  సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌‌ పసుపు రూ.12 వేల నుంచి రూ.13 వేల దాకా పలికింది. ఒకదశలో రూ.15వేలకు చేరుతుందని రైతులు ఆశించారు. కానీ పశ్చిమాసియా యుద్ధం సాకుతో వ్యాపారులు రేట్లు తగ్గించేశారు.  ప్రస్తుతం క్వింటాల్​ పసుపుకు రూ.9 వేలు మాత్రమే పెడ్తుండడంతో రైతులు తలపట్టుకుంటున్నారు.

కోల్డ్ స్టోరేజీల బాట..
ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు రైతులు తమ పంటను అగ్గువకు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీలు, గోదాంలను ఆశ్రయిస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధం తగ్గి, ఎగుమతులు పుంజుకుంటే ధర పెరుగుతుందని ఆశపడ్తున్నారు. అదే  సమయంలో యుద్ధం కొనసాగి రేట్లు మరింత తగ్గితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.  మరికొందరు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. మొత్తం మీద పశ్చిమా సియాపై యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప పసుపు మార్కెట్‌‌లో కదలిక వచ్చేలా కనిపించడం లేదని  మార్కెట్​వర్గాలు చెప్తున్నాయి.

క్వింటాల్కు రూ. 3 వేలకు పైగా నష్టం
వారం క్రితం రూ. 13 వేలకు పైగా పలికిన పసుపు, ప్రస్తుతం  రూ. 9, 10 వేలకు పడిపోయింది. ఒక్కో క్వింటాల్​పై  రూ. 3 వేల దాకా నష్టం వస్తోంది. యుద్దం ఆగిపోతే తప్ప రేట్లు పెరగయని వ్యాపారులు చెప్తున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో, మళ్లీ పసుపు రేట్లు ఎప్పుడు పెరుతాయో అర్థమైత లేదు.

బొక్కల తుక్కయ్య, పసుపు రైతు, వెల్ధుర్థి, జగిత్యాల రూరల్ మండలం

©️ VIL Media Pvt Ltd.