
మలయాళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం వరుస విజయాలతో ఊపుమీద ఉంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతోనే కాదు, భారీ కమర్షియల్ వసూళ్లతోనూ మాలీవుడ్ సత్తా చాటుతోంది. లేటెస్ట్ గా మలయాళ స్టార్ నటుడు జయసూర్య నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘ఆడు 3: వన్ లాస్ట్ రైడ్ – పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది.
పవన్ మూవీనే వెనక్కి నెట్టి!
ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సేల్స్‌ను కూడా ఈ చిత్రం అధిగమించడం విశేషం. కేవలం కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ట్రేడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. రెండో వారాంతం ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ. 111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
ఎందుకు అంత స్పెషల్?
మలయాళంలో ‘ఆడు’ సిరీస్ అంటే ఒక బ్రాండ్. ఇందులో జయసూర్య పోషించిన ‘షాజీ పాపన్’ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఒక ఎమోషన్. ఈ మూవీలో జయసూర్యతో పాటు వినాయకన్, సాయిజు కురుప్, ఇంద్రన్స్, సన్నీ వేన్, ధర్మజన్ వంటి హేమాహేమీల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది క్రియేటివ్ డైరెక్షన్ మిథున్ మాన్యువల్ థామస్ తన మార్క్ కామెడీ,ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఫ్రైడే ఫిల్మ్ హౌస్ , కావ్య ఫిల్మ్ కంపెనీలు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ ఫ్రాంచైజీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
జయసూర్య కెరీర్‌లో తొలిసారి!
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జయసూర్య కెరీర్‌లో ఇది తొలి 100 కోట్ల సినిమా. మలయాళ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన 14వ చిత్రంగా ‘ఆడు 3’ రికార్డు సృష్టించింది. కేరళలో మాత్రమే ఈ సినిమా రూ. 42 కోట్లకు పైగా వసూలు చేయగా, గల్ఫ్ మార్కెట్‌లోనూ రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది.
సక్సెస్ టీజర్‌తో నవ్వుల విందు
సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ‘సక్సెస్ టీజర్’ను విడుదల చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న కీలక సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. షాన్ రెహమాన్ సంగీతం, అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఈ ఫాంటసీ రైడ్‌ను మరింత రసవత్తరంగా మార్చాయి. మొత్తానికి, ‘షాజీ పాపన్’ అండ్ గ్యాంగ్ మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక గేమ్ చేంజర్ అని నిరూపించారు.