Reading Time: 2 minutes
PBKS vs GT: కుప్పకూలిన గుజరాత్.. చెత్త రికార్డ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్..!

Arshdeep Scripts Unwanted Record: ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన స్థాయిలో పరుగుల వరద పారలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 27 బంతుల్లో 39 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. సాయి సుదర్శన్ (13) త్వరగానే పెవిలియన్ చేరగా, జోస్ బట్లర్ (33 బంతుల్లో 38) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. గిల్ అవుట్ అయిన తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ తడబడింది.

పంజాబ్ కింగ్స్ బౌలర్ల పంజా..

మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా వంటి ఫినిషర్లు విఫలం కావడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ 3 వికెట్లతో చెలరేగగా, యుజ్వేంద్ర చాహల్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ ఒక వికెట్ సాధించాడు.

అర్ష్‌దీప్ సింగ్ ‘సుదీర్ఘ’ ఓవర్ – చెత్త రికార్డ్..

ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవర్‌ను పూర్తి చేయడానికి ఏకంగా 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఇందులో నాలుగు వైడ్‌లు, ఒక నో బాల్ ఉండటం గమనార్హం. దీనితో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ చేరిపోయాడు. గతంలో మహమ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, హార్దిక్ పాండ్యా వంటి వారు కూడా 11 బంతుల ఓవర్లను వేసి ఈ అప్రతిష్టను చవిచూశారు.

ఐపీఎల్ చరిత్రలో సుదీర్ఘ ఓవర్లు (బంతుల వారీగా):

11 – అర్ష్‌దీప్ సింగ్ vs GT, ముల్లన్‌పూర్, 2026 (20వ ఓవర్)

11 – హార్దిక్ పాండ్యా vs GT, వాంఖడే, 2025 (8వ ఓవర్)

11 – సందీప్ శర్మ vs DC, ఢిల్లీ, 2025 (20వ ఓవర్)

11 – శార్దూల్ ఠాకూర్ vs KKR, కోల్‌కతా, 2025 (13వ ఓవర్)

11 – తుషార్ దేశ్‌పాండే vs LSG, చెన్నై, 2023 (4వ ఓవర్)

11 – మొహమ్మద్ సిరాజ్ vs MI, బెంగళూరు, 2023 (19వ ఓవర్)

పంజాబ్ బౌలర్లు చివర్లో పట్టు బిగించడంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు ఎంత త్వరగా ఛేదిస్తారో చూడాలి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..