
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పెట్రోల్ బంక్ వద్ద ఒక యువకుడు తన బైక్‌కు బ్యాటరీ మారుస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. చూస్తుండగానే బైక్ నుండి మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు, క్షణాల్లోనే వాహనం అంతటా వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. బైక్ పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అందరిలోనూ వణుకు మొదలైంది. మంటలు గనుక బంక్‌కు వ్యాపిస్తే ఊహించని స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉండేది. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి మంటలు అంటుకున్న బైక్‌ను బంక్‌కు దూరంగా తరలించారు. వారి సమయస్ఫూర్తి వల్ల మంటలు బంక్‌కు వ్యాపించకుండా ఆగిపోయాయి. దీంతో ఒక భారీ అగ్నిప్రమాదం తప్పింది.
వాహనదారులకు అధికారుల హెచ్చరిక
ఈ సంఘటన నేపథ్యంలో అధికారులు, నిపుణులు వాహనదారులకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. పెట్రోల్ బంక్‌ల సమీపంలో ఎప్పుడూ వాహనాల బ్యాటరీ మార్చడం లేదా వెల్డింగ్ వంటి పనులు చేయకూడదు. బ్యాటరీ వైర్లు సరిగ్గా అమర్చకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంధనం ట్యాంకుకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. బ్యాటరీ వంటి సున్నితమైన భాగాలను మార్చేటప్పుడు నిపుణులైన మెకానిక్ పర్యవేక్షణలోనే చేయించుకోవడం ఉత్తమం.