Reading Time: < 1 minute

ముజఫర్‌నగర్: ఓ గిఫ్ట్ విషయంలో గొడవపడి.. తన భార్య, పిల్లలను హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్‌నగర్‌లోని సరవత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులను ఇర్షాద్ (32), అతని భార్య నోరీన్ (30), వారి రెండేళ్ల కుమారుడు అహిల్, రెండు నెలల కుమార్తె అక్షగా గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇర్షాద్ సోదరి షాహీన్ కోసం ఉద్దేశించిన ఒక ఈద్ బహుమతి విషయంలో ఆ దంపతుల మధ్య గొడవ జరిగిందని బంధువులు అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.