Reading Time: < 1 minute

డీల్‎కు ఒప్పుకోండి.. లేదంటే రణరంగమే: ఇరాన్‎కు అమెరికా ఫ్రెష్ వార్నింగ్

Caption of Image.

వాషింగ్టన్: యుద్ధం ఆపేందుకు ససేమిరా అంటోన్న ఇరాన్‎కు అమెరికా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్‎పై యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం (మార్చి 31) మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇరాన్ తెలివైనదైతే డీల్‎కు అంగీకరించాలి.. లేదంటే ఆ దేశం మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. 

సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొంచెం తెలివిగా వ్యవహారించాలని హితవు పలికారు. అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచాయని.. ఎంతలా అంటే ఇరాన్ సైనికులు నైతిక స్థైర్యం దెబ్బతిని సాయుధ దళాల నుంచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇక, ఇరాన్ మిస్సైల్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్ షరతులపై మాత్రమే ముగిసే ఈ యుద్ధంలో రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో భూతల దళాలను మోహరించే ఉద్దేశం అమెరికాకు లేదని.. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని బహిరంగంగా వెల్లడించబోమని హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.