
ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని సబ్-స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ నియామకాలలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. పొరుగు సేవల ద్వారా జరిగిన ఈ నియామకాలలో నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించిన వారిపై సంస్థ కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి.. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు.
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సబ్-స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం కొందరు అభ్యర్థులు ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా.. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు వెల్లడైంది. విచారణలో మొత్తం 69 మంది ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లతో నియామకం పొందినట్లు తేలింది. జిల్లాల వారీగా చూస్తే కడపలో అత్యధికంగా 38 మంది ఉండగా.. కర్నూలు 16, చిత్తూరు 4, నెల్లూరు 4, తిరుపతి 3, అనంతపురం 3, అన్నమయ్యలో 1గా గుర్తించారు.
Also Read: Krithi Shetty Comeback: కృతి ఈజ్ బ్యాక్.. గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?
ఈ నేపథ్యంలో నకిలీ ధృవపత్రాలు సమర్పించిన వారందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను శివశంకర్ ఆదేశించారు. సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో నియామకాల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరుగుతుందా?, బాధ్యులపై ఇంకెంత వరకు చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.