
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. డయల్ 100 ద్వారా కూకట్‌పల్లి పోలీసులు సంఘటన తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల ప్రకారం చెన్నారావు పేట మండల్ మాణిక్యం తాండా విలేజ్‌కు చెందిన బోడ ప్రవీణ్ (31) అదే ప్రాంతానికి చెందిన స్రవంతి(27) తో పదమూడేళ్ల క్రింతం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారు కూకట్‌పల్లి కైతలాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్నారు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు పిల్లలు బి.కార్తిక్ (12), బి.కౌశిక (10) ఉన్నారు. అయితే ప్రవీణ్ మరో అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడంతో భార్య స్రవంతికి తెలిసింది. అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు మొదలై పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం ఉంది. అయితే మనోవేధన అనుభవిస్తున్న స్రవంతి భర్తతో నాలుగు రోజుల క్రింత గొడవ జరిగి తన స్వగ్రామంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
అయితే ఊరి పెద్దలు సోమవారం ప్రవీణ్‌ను పలిపించి వారి సమక్షంలో నచ్చచెప్పడంతో స్రవంతి ప్రవీణ్‌లు ఇద్దరు కలిసి తిరిగి కూకట్‌పల్లిలోని వారి ఇంటికి వచ్చారు. ప్రవీణ్ రోజులాగే మంగళవారం ఉదయం తన పని మీద వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే తలుపులు తెరవక పోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి వారి సాయంతో తలుపులను బద్దలు కొట్టి చుడగా ఇద్దరు పిల్లలతో సహా స్రవంతి విగతిజీవులుగా పడి ఉన్నారు. ప్రవీణ్ తక్షణమే డయల్ 100కు ఫోన్ చేయడంతో కూకట్‌పల్లి పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. పంచనామా నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నాక ఏదైనా గొడవ జరిగిందా అన్న విషయంపై ఆరాతీసున్నారు. కుటుంబ కలహంతో స్రవంతి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.