
రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: పంటల సాగులో రసా యన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి.. నానో యూరియా, నానో డీఏపీతో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రైతులకు వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,600 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో వేలాది మంది రైతులు, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎంత మోతాదులో యూరియా వాడాలో ‘యూరియా యాప్’ ద్వారా తెలుసుకోవాలన్నారు.
ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న పలువురు రైతులను అభినందించారు. యాదాద్రి జిల్లాకు చెందిన యువ రైతు సందీప్ తన ప్రకృతి సాగు,స్వీయ మార్కెటింగ్ పద్ధతులను వివరించగా, ఖమ్మం జిల్లాకు చెందిన మహేంద్ర రెడ్డి వరి సాగులో నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకున్నారు.
నిజామాబాద్‌కు చెందిన మాజీ సైనికుడు నవీన్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాబురావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరును వివరించి తోటి రైతులకు స్ఫూర్తినిచ్చారు. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘రైతు ఉత్సవాల్లో’ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. జగిత్యాల, ఖమ్మం జిల్లాల రైతులు అడిగిన పలు సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు.