Reading Time: < 1 minute

బోర్ కొట్టిన రోజే ఆటకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెబుతా.. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు: షమీ

Caption of Image.

న్యూఢిల్లీ: టీమిండియాకు దూరమై చాలా కాలం అవుతున్నా ఇప్పట్లో తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్పష్టం చేశాడు. ఏజ్ పెరిగిందనో.. సెలెక్టర్లు తనను పక్కన పెట్టారనో కాకుండా తనకు ఆట మీద బోర్ కొట్టిన రోజే  క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్ బై చెప్తానని తేల్చిచెప్పాడు. గతేడాది మార్చిలో  చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన తర్వాత  ఇండియాకు దూరమైన షమీ డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగాల్ తరఫున 67 వికెట్లు తీసి తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరూపించుకున్నాడు. 

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మొదలు.. రంజీ ట్రోఫీలో సత్తా చాటినా సెలెక్టర్లు అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవడం లేదు. ఈ విషయంపై 35 ఏండ్ల షమీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘రిటైర్మెంట్ అనే ఆలోచన మనసులోకి వస్తేనే మనం అలసిపోయామని అర్థం.  ఇప్పుడు నాకు అలసట గానీ.. విసుగు గానీ లేదు. ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నా.  

ఫలితాలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. ఏ రోజైతే నాకు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బోర్ కొట్టినట్లు అనిపిస్తుందో అప్పుడే ఆటను ముగిస్తాను’ అని షమీ తెలిపాడు. సెలెక్షన్ గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్నో తరఫున ఆడుతున్న ఈ స్టార్ పేసర్.. తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ కోసం వంద శాతం కష్టపడతానని పేర్కొన్నాడు.

 

©️ VIL Media Pvt Ltd.