
తెలంగాణ ప్రజా భవన్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ప్రగతిపై కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని ఆయన గుర్తుచేశారు. డిసెంబర్ 9, 2023న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం అద్భుత ఫలితాలను ఇస్తోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి.. దాదాపు 10 వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళా ప్రయాణికులను కేవలం ప్రయాణికులుగా మాత్రమే కాకుండా, వారిని ఆర్టీసీకి యజమానులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 లక్షల మంది మహిళలే ఉంటున్నారని.. 97 డిపోల పరిధిలో రోజూ 35 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. ఈ భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఆయన ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాఖీ వంటి పండుగ దినాల్లోనూ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందించిన కార్మికుల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.
ఆర్టీసీని రాష్ట్రంలోని ప్రతి మూలకు చేర్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా కొత్త రూట్లు, కొత్త బస్సులు , బస్ స్టేషన్ల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధుల నుంచి నివేదికలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 340 కొత్త రూట్లలో బస్సులను ప్రారంభించామని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
కార్మికుల సంక్షేమంపై స్పందిస్తూ.. CCS, PF బకాయిలను తీరుస్తున్నామని, యూనియన్ల ఏర్పాటు, ఆర్టీసీ విలీనం అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని, యూనియన్ల పేరుతో రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణకు ఆర్టీసీయే లైఫ్ లైన్ అని ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.