
- జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ , లోక్‌సభ సెగ్మెంట్ల ‘రీ-డ్రాయింగ్’
- సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం
- ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం
- పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
- హైదరాబాద్, శివారు జిల్లాలకే ‘సింహభాగం’ సీట్లు..
- మూడు లోక్‌సభ స్థానాలుగా మల్కాజ్గిరి!
- కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు
- బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణాలు
- ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు
- రాజకీయ నేతలతోపాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. డీలిమిటేషన్ గైడ్‌లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశముంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి.
ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హైదరాబాద్, దాని శివారు జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా, అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి.
ప్రభుత్వ ప్రణాళికా విభాగం, కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం, 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3.84 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వే (సీపెక్) ప్రకారం 3.71 కోట్లుగా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టనున్న జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.84 కోట్లకు కొంచెం అటు, ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి.
అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు.. ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాల్లోని అనేక సెగ్మెంట్లు రెండు నుంచి మూడుగా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు నుంచి ఇటు , ఇటు నుంచి అటు కలపక తప్పదని చెప్తున్నారు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పులతోపాటు కొత్తగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు రానున్నాయి.
దీంతో దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతలు 2029 ఎన్నికల నాటికి తమ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు. ఇక భౌగోళిక హద్దులతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా మారిపోనుండడంతో డీలిమిటేషన్‌పై సామాన్య జనంలోనూ తీవ్ర ఆసక్తి నెలకొన్నది.
సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం
సీపెక్ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణ జనాభా 3.84 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో 22.58 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 3.22 లక్షల జనాభా ఉంది. కానీ పునర్విభజన ద్వారా వీటి సంఖ్యను 17 నుంచి 25కు, 119 నుంచి 179కి పెంచాలంటే ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 15.36లక్షలు, అసెంబ్లీ స్థానంలో 2.14లక్షల జనాభా ఉండేలా చూస్తారు. అంటే పునర్విభజన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో సగటు జనాభా దాదాపు లక్ష దాకా, లోక్‌సభ పరిధిలో 7 లక్షల దాకా తగ్గనుంది. దీంతో నియోజకవర్గాల విస్తీర్ణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్, శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం కేవలం మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమైంది. హైదరాబాద్ (1.05 కోట్లు), రంగారెడ్డి (53 లక్షలు), మేడ్చల్ మల్కాజిగిరి (35 లక్షలు) జిల్లాల మొత్తం జనాభా 1.93 కోట్లుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ మూడు జిల్లాల పరిధిలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గాన్ని రెండు లేదా మూడు ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న 15 సీట్లు ఏకంగా 49కి, రంగారెడ్డిలో 8 నుంచి 25కి, మేడ్చల్ మల్కాజిగిరిలో 5 నుంచి 16కి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి.
మెజారిటీ లోక్‌సభ సీట్లు కూడా ఈ మూడు జిల్లాల్లోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 46లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. నల్గొండ (16.80 లక్షలు), నిజామాబాద్ (15.90 లక్షలు), ఖమ్మం (14.80 లక్షలు) వంటి పెద్ద జిల్లాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జిల్లాకేంద్రాల్లో ఉన్న జనాభా దృష్ట్యా అర్బన్ నియోజకవర్గాల సంఖ్య పెరిగి, రూరల్నియోజకవర్గాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ములుగు జిల్లా అంతా ఒకటే నియోజకవర్గం ఉండగా, పునర్విభజన తర్వాత రెండుకు చేరే అవకాశముంది.
నార్త్, సౌత్, అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా..
జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు సహజంగానే రెండు, మూడు నియోజకవర్గాలుగా మారిపోనున్నాయి. ఉదాహరణకు సీపెక్సర్వే ప్రకారం నిజామాబాద్, కరీంనగర్ నగరాల జనాభా ఇంచుమించు 4.50 లక్లల చొప్పున ఉంది. ప్రస్తుతం ఈ రెండు సిటీలు.. ఆయాచోట్ల ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండగా, పునర్విభజన తర్వాత రెండేసి నియోజకవర్గాలుగా మారనున్నాయి.
ప్రస్తుతం నిజామాబాద్‌సిటీ మొత్తం నిజామాబాద్ అర్బన్ పరిధిలోకి వస్తుండగా, నిజామాబాద్‌సౌత్, నార్త్ కింద మారే అవకాశముంది. కరీంనగర్‌ను సైతం కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ అనో, కరీంనగర్ నార్త్, కరీంనగర్ సౌత్ అని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒకే సిటీ పరిధిలో ఇద్దరేసి ఎమ్మెల్యేల చొప్పున ఉండనున్నారు.
ఇలా నగరాలు, జిల్లాకేంద్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ ప్రాబల్యం పట్టణాల చుట్టూ కేంద్రీకృతం కానుంది. మరోవైపు జనసాంద్రత తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో 2.14 లక్షల కోటాను భర్తీ చేసేందుకు మరిన్ని గ్రామాలను కలపాల్సి వస్తుంది. తద్వారా ఆ నియోజకవర్గాల భౌగోళిక విస్తీర్ణం అమాంతం పెరుగుతుంది. పాత నియోజకవర్గాల్లోని కీలక మండలాలు, గ్రామాలు వేరే నియోజకవర్గాల్లోకి, వేరే జిల్లాల్లోకి వెళ్లడం వల్ల దశాబ్దాలుగా ఉన్న సామాజిక, రాజకీయ బంధాలు తెగిపోనున్నాయి.
ఓటర్ల జాబితానూ సవరిస్తరు..
ప్రస్తుతం రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ, పునర్విభజన మాత్రం జనాభా ఆధారంగానే జరుగుతుంది. ఒకసారి సరిహద్దులు ఖరారైన తర్వాత, ఆ కొత్త మ్యాప్ ప్రకారం ఓటర్ల జాబితాను సవరిస్తారు. ఇక అప్పటికి ఉన్న తుది జాబితా ప్రకారం ఉన్న ఓటర్లను ఆయా కొత్త నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు మారుస్తారు. అంటే ఓటు ఎక్కడ ఉందో అక్కడే ఉన్నప్పటికీ, ఓటు వేసే నియోజకవర్గం పేరు లేదా నంబర్ మారిపోయే అవకాశం ఉంది.
పూర్తి శాస్త్రీయంగా నియోజకవర్గాల విభజన..
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా, జనాభా లెక్కల ప్రాతిపదికన, పకడ్బందీగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అధికారిక ‘సెన్సస్ టేబుల్స్’ లోని డేటాను వాడుకుంటూ, ప్రతి గ్రామం, పట్టణ వార్డును ఒక ప్రాథమిక యూనిట్‌గా తీసుకుని పునర్విభజన కమిషన్ ఈ భారీ కసరత్తును నిర్వహించనుంది.
మొదట రాష్ట్ర మొత్తం జనాభాను ప్రతిపాదిత సీట్ల సంఖ్యతో భాగించి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన ‘సగటు జనాభా కోటా’ను ఖరారుచేస్తారు. ఆపై జిల్లా జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని సీట్లు రావాలో పంపిణీ జరిపి, అనంతరం ‘బ్లాక్ బిల్డింగ్’ పద్ధతిలో ఒక దిశ నుంచి గ్రామాలను, మండలాలను కలుపుకుంటూ వెళ్తూ, ఎప్పుడైతే జనాభా నిర్ణీత కోటాకు చేరువవుతుందో అక్కడ ఒక నియోజకవర్గ సరిహద్దును ఖరారు చేస్తారు.
ఈ ప్రక్రియలో ఒక గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకుండా, అనివార్యమైతేనే మండలాన్ని ముక్కలు చేస్తూ భౌగోళిక సామీప్యతను, రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ వంటి వార్డులు, డివిజన్ల వారీ డేటా ఆధారంగా నగర నియోజకవర్గాల పరిధిని నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిని బట్టి ఆయా వర్గాలకు సీట్లను రిజర్వ్ చేస్తూ, సహజ సిద్ధమైన నదులు, కొండలు వంటి సరిహద్దులు ప్రజా సౌకర్యమే ప్రాధాన్యతగా సరికొత్త రాజకీయ భూగోళానికి కమిషన్ తుది రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తున్నది.
మారనున్న రిజర్వేషన్ల లెక్క.. కొత్త సమీకరణాలు!
కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాలవారీగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు.
కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్‌గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వుడ్‌గా, అలాగే ప్రస్తుతం రిజర్వుడ్ స్థానాలు జనరల్‌గా మారే అవకాశముంది. అదే సమయంలో 33శాతం మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి.