Reading Time: 2 minutes
Shreyas Iyer Captaincy Record How He Transformed Dc And Pbks Into Playoff Contenders

Shreyas Iyer Captaincy Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్సీ అనేది ఒక కళ. మెగా లీగ్‌లో అద్భుత జట్టును విజయవంతంగా నడిపించడం సాధారణ విషయమే. అయితే సాధారణ స్థాయిలో ఉన్న జట్టును ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అతడి కెప్టెన్సీ రికార్డులు చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఎంత ప్రభావం చూపాడో ఇట్టే అర్థమవుతుంది.

శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఐదు సీజన్లలో కెప్టెన్‌గా చేశాడు. ఈ ఐదు సీజన్లలో అతడు సారథ్యం వహించిన టీమ్స్.. నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరడం అతడి కెప్టెన్సీ స్థిరత్వానికి నిదర్శనం. అంతేకాకుండా మూడు సార్లు ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లి.. ఒకసారి టైటిల్ గెలిపించాడు. ఇది అతడి నాయకత్వ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొత్తం మీద శ్రేయస్ విజయం శాతం 59.30గా ఉండటం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డులలో ఒకటి.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ జట్లకు సారథ్యం వహించి శ్రేయస్ అయ్యర్ ఈ విజయాలు అందుకున్నాడు. అతడు కెప్టెన్సీ చేపట్టే ముందు కొన్ని జట్లు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ జట్టు ఎనిమిదేళ్లుగా ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. అయితే శ్రేయస్ నాయకత్వంలో ఢిల్లీ కొత్త ఊపిరి పొంది ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్ దాదాపు పది సంవత్సరాల పాటు ప్లేఆఫ్స్‌ ముఖం చూడలేదు. అలాంటి జట్టు తల రాతను శ్రేయాస్ ఒక్క సీజన్‌లోనే మార్చి.. పోటీదారుగా మార్చాడు. ఒత్తిడిలో ఉన్న జట్లను విజయపథంలో నడిపించడం అతడి కెప్టెన్సీని ఉన్నత స్థానంలో నిలిపింది.

Also Read: Shreyas Iyer Record: ‘కింగ్ ఎక్కడన్నా కింగే’ రా.. పీబీకేఎస్, కేకేఆర్ చరిత్రలోనే శ్రేయస్ అయ్యర్ టాప్‌!

అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కూడా గొప్ప విషయం. ప్రతి జట్టులోని ఆటగాళ్లతో కలిసిపోవడం, వారి బలాబలాలను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు అతడిని ప్రత్యేక నాయకుడిగా నిలబెడుతున్నాయి. భవిష్యత్తులో టీమిండియా వైట్ బాల్ క్రికెట్, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడి నాయకత్వం, స్థిరత్వం, ఆటపై అవగాహన చూస్తుంటే.. భారత జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం అతడికి ఉందని చెప్పడంలో సందేహం లేదు.