
- మార్జిన్ రూ.26 నుంచి ఒకేసారి రూ.16కి తగ్గింపు
- పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన.. మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన
- కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బుధవారం నుంచి బంద్ చేయనున్నట్టు తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ ప్రకటించింది. తమకిచ్చే మార్జిన్స్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి షాపులు మూసివేస్తామని వారం కిందటే ప్రకటించినా కంపెనీల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో షాపులు బంద్పెట్టాలని నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపు ఓనర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని, పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు తెలిపారు.
గతంలో కిలో చికెన్‌కు రూ.26 మార్జిన్ ఇచ్చిన పౌల్ట్రీ కంపెనీలు ఇప్పుడు రూ.16కి తగ్గించాయని, దీంతో ఖర్చులు పోగా కిలోకు రూ.5 నుంచి రూ.6 కూడా మిగలడం లేదని, షాపు రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు,ఇతర ఖర్చులతో పాటు అమ్ముడుపోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని షాపుల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బంద్ చేస్తామని ప్రకటించిన తర్వాత చికెన్ రేటును రూ.350 నుంచి రూ.250లకు తగ్గించారని, వారం రోజుల్లో కిలోకు రూ.100 రేటు తగ్గడం గతంలో ఎప్పుడు జరగలేదని వివరించారు. తమ ఆందోళనతో చికెన్ కంపెనీల లొసుగులు, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ధర తగ్గించారని ఆరోపించారు.
వెయిట్ లాస్, వేస్టేజీతో మరిన్ని నష్టాలు
పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక్కో స్లాట్‌లో 33 కేజీల లైవ్ బర్డ్స్ వెయిట్ చేసి సప్లై చేస్తుండగా షాపుకు చేరేసరికి 2 కేజీల వెయిట్ తగ్గిపోతున్నది. ఒక లైవ్ బర్డ్ 1,650 గ్రాముల వరకు ఉంటే వేస్టేజీ పోగా 700 నుంచి 750 గ్రాముల చికెన్ మాత్రమే వస్తోందని, ఈ తేడా తగ్గించాలని కోరినా పట్టించుకోని పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ను మరింత తగ్గించాయని ఆరోపించారు. మార్జిన్ రూ.45 వరకు పెంచాలని డిమాండ్ చేశారు.
చిన్న షాపులను తొక్కేసే కుట్ర
పెద్ద పెద్ద హోటళ్లకు నేరుగా పౌల్ట్రీ కంపెనీలే చికెన్సప్లై చేస్తూ చిన్న షాపులను తొక్కేయాలని చూస్తున్నారని, పౌల్ట్రీ సెక్టార్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని కార్పొరేట్ శక్తులు కుట్ర చేస్తున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి కోళ్లను తక్కువ ధరకే కొంటున్న పౌల్ట్రీ కంపెనీలు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. అయితే.. ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలతో పాటు కోళ్ల మరణాల రిస్క్ పెరగడం.. ఫామ్‌ల నిర్వహణలో ఖర్చులు పెరగడంతో లైవ్ చికెన్ ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ కంపనీలు చెప్తున్నాయి.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. చికెన్ బిజినెస్ దెబ్బతింటే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ షాపుల బంద్‌కు వినియోగదారులు సహకరించాలని కోరారు. అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హోటల్, ఫుడ్ రంగంపై ప్రభావం
చికెన్ షాపులు మూతపడితే హైదరాబాద్‌లో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ డెలివరీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. సిటీలో చికెన్ మీదే అధారపడి నడుస్తున్న వందలాది బిర్యానీ సెంటర్ల బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 6 వేల నుంచి -8 వేల బిర్యానీ సెంటర్లు ఉండగా, అందులో దాదాపు 80 శాతం సెంటర్లు చికెన్ బిర్యానీలే అమ్ముతున్నాయి.
బర్గర్, పిజ్జా, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లులలో కూడా ఎక్కువగా చికెన్ ఐటమ్స్ అమ్ముడవుతుంటాయి. చికెన్ లేకపోతే ఎగ్ ఐటమ్స్ గిరాకీ పెరగవచ్చని, గుడ్ల డిమాండ్ 30 శాతం పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. హైదరాబాద్‌లోనే 8 నుంచి-10 వేల చికెన్ రిటైల్ షాపులుండగా.. రోజుకు 800- నుంచి 1,000 టన్నుల చికెన్ సప్లై జరుగుతున్నది.