
అన్నం పెట్టే చేయిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ.. అదే చేత్తో విషం కలిపి పెడితే..? భాగ్యనగరంలో తాజాగా వెలుగుచూసిన కుళ్ళిన మాంసం ఉదంతం వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం ఇంతటి నీచానికి ఒడిగడతారా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో హోటల్‌కు వెళ్లి ముక్క ముట్టుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి ఏర్పడింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో నాలుగు మెతుకులు ప్రశాంతంగా తిందామనుకునే సామాన్యుడి నమ్మకాన్ని కాలరాస్తున్న ఈ ‘ఆహార ఉగ్రవాదం’పై ఉక్కుపాదం మోపాల్సిన సమయం వచ్చింది.
నగరంలో ‘కుళ్ళిన మాంసం’ దందా..
హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పరిధిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ , జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి “A to Z Sheep And Goat Offals” పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారం వెనుక ఉన్న నిజాలు బయటపడ్డాయి.
మోసపూరిత విక్రయాల తీరు..
ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను (లివర్, కిడ్నీ వంటివి) అఫ్రోజ్ తెప్పించేవాడు. వీటిని నెలల తరబడి డీప్ ఫ్రీజర్లలో, పాడైపోయిన నీరు ఉన్న ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేసేవారు. దుర్వాసన రాకుండా రసాయనాలను వాడుతూ, ప్రజలకు అది తాజా మాంసం అని నమ్మబలికి విక్రయించేవారు. తాజా దాడిలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ హోటళ్లకు సరఫరా..
కేవలం చిన్న చిన్న దుకాణాలకే కాకుండా, హైదరాబాద్‌లోని కొన్ని పేరుమోసిన హోటళ్లకు కూడా ఈ మాంసం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాల్లో ఈ కుళ్ళిన మాంసమే వాడుతున్నారన్న వార్త ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
పదే పదే అదే తప్పు..
విచారణలో మరో సంచలన విషయం ఏంటంటే.. ఇదే వ్యక్తిపై గడిచిన మార్చి 10వ తేదీనే జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ మళ్లీ అదే దందా కొనసాగించాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డబ్బు పిచ్చితో మనుషుల ప్రాణాలను బలితీసుకునే ఇలాంటి కసాయిలపై కేవలం జరిమానాలతో సరిపెట్టకూడదు. కఠినమైన శిక్షలు పడితేనే సామాన్యుడి ప్లేటులోకి వచ్చే ఆహారం సురక్షితంగా ఉంటుంది. తినే ఆహారం విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.