
జీడిమెట్ల, వెలుగు: ప్రమాదకరంగా తవ్విన సెల్లార్ గుంత కుప్పకూలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాజులరామారంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన భవన నిర్మాణం కోసం ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా భారీ సెల్లార్ గుంత తవ్వారు. ఆ గుంతకు ఆనుకుని బ్లింకిట్ కార్యాలయం ఉంది.
అక్కడ పనిచేసే సాయికుమార్ (27) మంగళవారం సాయంత్రం వాష్‌రూమ్‌కు వెళ్లగా, సెల్లార్ గుంత ప్రభావంతో బాత్‌రూమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలు సాయికుమార్‌పై పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సెల్లార్ తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.