
వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి అధ్యక్షతన నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ. 55.31 కోట్ల ఆదాయ అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మంజూరైన రూ. 18.7 కోట్ల నిధుల వినియోగం, శ్మశాన వాటికల నిర్వహణ, బర్నింగ్ మిషన్ల ఏర్పాటు, డంపింగ్ యార్డు ఆధునీకరణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ బడ్జెట్‌లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు, మూడవ వంతు నిధులను మురికివాడలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించినట్లు వెల్లడించారు. గతేడాది రూ. 36.46 కోట్ల ఆదాయం రాగా, రూ. 28.03 కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుతం రూ. 8.43 కోట్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఉన్నట్లు వివరించారు.