
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు.. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా తన బృందంతో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో తాండూరుకు చెందిన మహ్మద్ అఫ్సర్ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన ఇండస్ట్రియల్ కలర్స్ , గడువు ముగిసిన ముడి సరుకులతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా ఎస్బీఐ కాలనీకి చెందిన డి. శ్రీనివాస్ నిర్వహిస్తున్న శ్రీ నందిని ఐస్ క్రీమ్ కేంద్రంలో కూడా నాణ్యత లేని, హానికరమైన రంగులను వాడుతున్నట్లు బయటపడింది. పోలీసులు ఈ రెండు కేంద్రాల నుండి భారీగా కల్తీ ఐస్ క్రీమ్స్‌తో పాటు, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కల్తీ వ్యాపారాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు.అపరిశుభ్ర వాతావరణంలో, రసాయనాలతో తయారయ్యే ఐస్ క్రీమ్స్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని.. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.