
గౌహతి: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వమే వస్తుందని మోడీ చెప్పారు. గత పదేళ్లలో అస్సాం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, రాష్ట్ర ప్రజలు బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)ని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బుధవారం గోగాముఖ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికతకు రూపం ఇస్తాయని అన్నారు. “ఈసారి ఎన్నికలు విక్సిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను నిర్మించడానికే… అస్సాంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
అస్సాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాని అన్నారు. రాబోయే ఎన్నికలు ఎన్డీఏకు స్పష్టమైన హ్యాట్రిక్ అందిస్తాయని, అయితే కాంగ్రెస్ తన ‘స్వయం ప్రకటిత యువరాజు’కు హ్యాట్రిక్ ఓటమితో పాటు ‘వంద ఓటములను’ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఉన్నారని, భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడమే దీనికి నిదర్శనమని ప్రధాని మోదీ సభకు తెలిపారు. “అస్సాం ఎన్నికల ప్రకటన తర్వాత నేను పాల్గొంటున్న మొదటి బహిరంగ సభ ఇది. మూడోసారి ఎన్నికల్లో విజయం ఖాయమని చెప్పడానికి ఈ జనసముద్రమే నిదర్శనం” అని మోడీ అన్నారు. కాగా, ఏప్రిల్ 9న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.