Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి)పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ మేదినీపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు. “మొత్తం 294 నియోజకవర్గాలలో నన్ను మీ అభ్యర్థిగా భావించండి” అని దీదీ అన్నారు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో సిఎం మమతపై మరోసారి బిజెపి నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నాడు. 2021లో నందిగ్రామ్, భవానిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సువేందు.. మమతను ఓడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మమతపై సువేందు పోటీ చేస్తున్నారు.