
సమ్మర్ లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తగరం వెంకన్న సూచించారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా భారీ ఆస్తి, ప్రాణ నష్టాలను అడ్డుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో జరిగే అగ్ని ప్రమాదాల్లో అత్యధికం షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో విద్యుత్ వైర్లు కాలం చెల్లితే వెంటనే మార్చుకోవాలని సూచించారు. పాత వైరింగ్ వల్ల విద్యుత్ భారం పెరిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎండాకాలంలో ఏసీల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. అయితే ఏసీలను ఉపయోగించే వారు వాటికి తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించుకోవాలని వెంకన్న కోరారు. మనం వాడే విద్యుత్ ఉపకరణాల( ఏసీ,ఫ్రిడ్జ్, ఇండక్షన్ స్టవ్, వాషింగ్ మిషన్,కూలర్, వాటర్ హీటర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఒకేసారి వాడినపుడు ) సామర్థ్యానికి అనుగుణంగానే విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలి. లోడ్ సామర్థ్యం కంటే ఎక్కువ విద్యుత్తును వాడటం వల్ల హై వోల్టేజ్ సమస్యలు తలెత్తి షార్ట్ సర్క్యూట్‌లకు దారితీస్తాయని వివరించారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అది విస్తరించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఏర్పాటు చేసుకోవడం బెటర్ అని చెప్పారు. మంటలను ప్రాథమిక దశలోనే అదుపు చేస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే వేసవిలో ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎండిన చెత్తాచెదారం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.