
- పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం
- నేలవాలిన వరి, మొక్కజొన్న.. రాలిపోయిన మామిడికాయలు
అకాల వర్షం రాష్ట్రంలో రైతులను ఆగమాగం చేసింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో కోతకొచ్చిన వరితో పాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలకొరిగాయి.. మామిడికాయలు రాలిపోయాయి. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. జనగామ, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లోని మార్కెట్లలో ధాన్యం తడిసిపోయింది. జనగామలో వరద ధాటికి మార్కెట్‌లో ఉన్న మక్కలు కొట్టుకుపోయాయి.
వెలుగు నెట్ వర్క్: అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. జనగామ, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం వర్షం పడింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో కోతకొచ్చిన వరితో పాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలగా.. మామిడికాయలు రాలిపోయాయి. జనగామలో వరద ధాటికి మార్కెట్‌లో ఉన్న మక్కలు కొట్టుకుపోయాయి. నిజమాబాద్ గంజ్ మార్కెట్‌లో వరద నీరు చేరడంతో పసుపు తడిసిపోయింది. అకాల వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో సోమవారం అర్ధరాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షం కారణంగా తడిసి ముద్దయింది. పలిమెల, మహదేవపూర్, కాటారం మండలాల పరిధిలో చెట్లు విరిగిపోయాయి.
* కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు సదాశివనగర్, గాంధారి, పిట్లం, లింగంపేట, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, భిక్కనూరు, కామారెడ్డి, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి తదితర మండలాల్లో మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిట్లం మండలంలో జొన్న పంటకు కొంత మేర నష్టం జరిగింది.
* నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయడంతో మొక్కజొన్న, జొన్న, పసుపు, వరి చేన్లు నేలవాలాయి. నిర్మల్, ముథోల్, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్ మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు ఐదు వేల ఎకరాల్లో మామిడి నేలరాలినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే 1,100 మంది రైతులకు సంబంధించి 1,300 ఎకరాల్లో మొక్కజొన్న, 300 ఎకరాల్లో జొన్న, 500 ఎకరాల్లో పసుపు పంటకు నష్టం జరిగింది.
* అకాల వర్షం కారణంగా జగిత్యాల జిల్లాలోని 126 గ్రామాల్లో 5,986 మంది రైతులకు చెందిన సుమారు 9,393 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అత్యధికంగా 6,162 ఎకరాల్లో మామిడి దెబ్బతినగా, 1,521 ఎకరాల్లో మొక్కజొన్న, 1,128 ఎకరాల్లో వరి, 582 ఎకరాల్లో నువ్వుల పంటకు నష్టం జరిగింది. ఒక్క రాయికల్ మండలంలోనే 3,425 ఎకరాలతో నష్టం జరుగగా, మల్లాపూర్‌లో 1,017, కోరుట్లలో 895, మెట్‌పల్లిలో 725 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు సమాచారం.
* నిజామాబాద్జిల్లా నవీపేట్, రేంజల్ మండలాల్లో వందల ఎకరాల్లో వరి నేలకొరిగింది. రెంజల్ మండలంలోని బోర్గం, కందకుర్తి గ్రామాల్లో పొగాకు బట్టీల్లో ఆకు తడిసిపోయింది.
* జనగామ జిల్లాలో వర్షం కారణంగా మార్కెట్‌లో ఉన్న వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు రాలిపోయాయి. వరద నీటిలో కొట్టుకుపోతున్న వడ్లు, మక్కలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
*నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం కారణంగా కోతకు రెడీగా ఉన్న 2,054 ఎకరాల వరికి నష్టం వాటిల్లింది. 119 ఎకరాల మామిడి, 73 ఎకరాల్లో నువ్వులు, 70 ఎకరాల్లో జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి, నిజామాబాద్ రూరల్, నవీపేట, వేల్పూర్, ఎర్గెట్ల, రెంజల్, ఆలూర్, నందిపేట, భీంగల్, డిచ్‌పల్లి, ఆర్మూర్, మాక్లూర్, కమ్మర్‌పల్లి, జక్రాన్‌పల్లిలో ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షం కారణంగా ఇందూర్ గంజ్ మార్కెట్‌లో ఉన్న పసుపు తడిసిపోయింది.
* మంచిర్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు తోడు వర్షం పడడంతో మామిడికాయలు రాలిపోగా, వరి, మక్క, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో నష్టం అధికంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 351 ఎకరాల్లో వరి, 1,820 ఎకరాల్లో మక్కకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.
* జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, బెల్లంపల్లి, నెన్నెల, తాండూర్, మందమర్రి మండలాల్లో 804 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం జరిగట్లు తెలుస్తోంది. వర్షానికి దెబ్బతిన్న పంటలను మంగళవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు పరిశీలించారు. ఎకరానికి రూ. 50 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.