
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2025.-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టైడ్ గ్రాంట్స్ రూ.371.91 కోట్లు, అన్‌టైడెడ్ గ్రాంట్స్ రూ.247.94 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా కేంద్రం నుంచి మరో వెయ్యి కోట్ల వరకు ఇంకా రావాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను దశల వారీగా విడుదలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన,
స్థానిక స్వపరిపాలనను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించింది. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 12,600 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన అభివృద్ధి పనులకు ఈ నిధులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వినియోగించుకోవాల్సి ఉంటుంది.