
చెన్నై: డిఎంకెను గెలిపిస్తే.. 20 లక్షల మంది రైతులకు పంపుసెట్లు అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు సిఎం స్టాలిన్ పలు హామీలను ప్రకటించారు. బుధవారం తిరుచిరాపల్లిలో సిఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ.. DMK తిరిగి అధికారంలోకి వస్తే.. 20 లక్షల మంది రైతులకు పంపుసెట్లు అందిస్తామని, క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ. 3,500 చొప్పున సేకరిస్తామని ఆయన తెలిపారు. మహిళలు తమకు నచ్చిన దుకాణాల్లో, తమకు ఇష్టమైన గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా రూ. 8,000 విలువైన కూపన్‌ను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని స్టాలిన్ కోరారు.
రాష్ట్రంలో DMK ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన వెంటనే.. తిరుచి ప్రాంతంలో ఓ భారీ గ్రంథాలయం, TIDEL పార్క్, ఒలింపిక్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తిరుచిరాపల్లిని రాజధాని నగరం చెన్నైకి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని సిఎం చెప్పారు. “పదేళ్లపాటు అధికారంలో ఉన్న AIADMK, తమిళనాడును తిరోగమనంలోకి నెట్టివేసింది. BJP తమిళనాడుకు ఎటువంటి నిధులు సమకూర్చలేదు. ఎడప్పాడి పళనిస్వామి తన బంధువులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వాన్ని నడిపారు” అని స్టాలిన్ విమర్శించారు.
తమిళనాడులో కుల ఘర్షణలు లేవు
తమిళనాడులో కుల ఘర్షణలు లేవని.. BJP పాలిత రాష్ట్రాల్లోనే మత హింస కనిపిస్తోందని సిఎం స్టాలిన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మూక హింసలు, మణిపూర్‌లో నిరంతర హింసాకాండ జరుగుతుందని అన్నారు. తమిళనాడులో అటువంటి పరిస్థితులను సృష్టించడానికి BJP చేసిన కుట్రలను తాము తిప్పికొట్టామన్నారు. తమ పాలనలో నెలకొన్న ప్రశాంత వాతావరణం, సమర్థవంతమైన పరిపాలన కారణంగానే, తమిళనాడుకు పెట్టుబడులు నిలకడగా తరలివస్తున్నాయని సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.