Reading Time: < 1 minute
April Fools Day history: ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 450 ఏళ్ల నాటి వింత చరిత్ర తెలిస్తే..

ఏప్రిల్‌1 అనగానే అందరికీ ఠక్కున్న గుర్తుకు వచ్చేది ఎవరినైన ఫుల్‌ చేయాలనే ఆలోచన. ఏప్రిల్‌ 1న ఎవరో ఒకరినీ సరదాగా ఆటపట్టించటం, కాసేపు నవ్వుకోవటం నిజంగానే ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ఏప్రిల్ ఫూల్స్ డే పుట్టుక గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ సంప్రదాయం 1582లో ఫ్రాన్స్‌లో మొదలైంది. అప్పటి వరకు ఐరోపాలో జూలియన్ క్యాలెండర్ అమలులో ఉండేది. దాని ప్రకారం వసంత కాలం ప్రారంభంలో, అంటే ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకునేవారు. అయితే, పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టి, కొత్త సంవత్సరాన్ని జనవరి 1కి మార్చారు. ఆ రోజుల్లో సమాచార వ్యవస్థ వేగంగా లేకపోవడం వల్ల చాలా మందికి ఈ మార్పు తెలియలేదు. వారు ఎప్పటిలాగే ఏప్రిల్ 1న వేడుకలు జరుపుకోగా, విషయం తెలిసిన వారు వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచి ఆటపట్టించడం మొదలుపెట్టారు.

అలా మొదలై 18వ శతాబ్దంలో ఈ సంప్రదాయం బ్రిటన్‌కు చేరింది. స్కాట్లాండ్‌లో దీనిని రెండు రోజుల పాటు జరుపుకునేవారు. క్రమంగా భారత్ లో కూడా పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియా రాకతో ఇప్పుడు వినూత్నమైన జోకులు, ప్రాంక్ వీడియోలతో ఈ రోజును గడుపుతున్నారు. చరిత్రలో కొన్ని కంపెనీలు కూడా ఏప్రిల్ ఫూల్ ప్రాంక్స్ చేశాయి. 1957లో BBC ఒక వార్తను ప్రసారం చేస్తూ, స్విట్జర్లాండ్‌లో చెట్లపై స్పఘెట్టి (Spaghetti) పండుతోందని చెప్పి అందరినీ నమ్మించింది. ఇలాంటి సరదా సంఘటనలు ఈ రోజుకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి.

ఏప్రిల్ ఫూల్స్ డే అంటే కేవలం ఇతరులను అవమానించడం కాదు, జీవితంలోని ఒత్తిడిని మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవడం. అయితే, మన జోకులు ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా, వారికి హాని కలగకుండా చూసుకోవడం ముఖ్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..