Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ప్రసక్తే లేదని స్ఫస్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.

‘‘దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అధికంగా కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎల్పిజి నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఆలోచిస్తోంది. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి. రెండు నెలల క్రితం బ్యారెల్‌కు 70 డాలర్ల దగ్గర ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్, ఈ రోజు 100 డాలర్ల మార్కును దాటింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు డీజిల్, పెట్రోల్‌ ధరలను పెంచలేదు. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం’’ అని పేర్కొన్నారు.