
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఒక అధికార పక్షం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్షం సంపూర్ణ మద్దతు పలకడం విశేషం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్దికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్న మాణిక్యం ఠాగూర్, అమరావతితోపాటు తిరుపతి,విజయవాడ, వైజాగ్ నగరాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు.
అంతకు ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా బిల్లును సవరించారు. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చర్చలో టీడీపీ ఎంపీలు పెమ్మసాని, అప్పలనాయుడు, దగ్గుమళ్ల , బీజేపీ నుంచి పురంధేశ్వరి, జనసేన నుంచి బాలశౌరి పాల్గొననున్నారు. వైసీపీ సైతం ఈ బిల్లుకు మద్దతు పలికింది. ఆ పార్టీ తరుఫున బిల్లుపై ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ఇక, లోక్‌సభలో ఆమోదం తర్వాత బిల్లు, రాజ్యసభకు వెళ్లనుంది. ఇదిలావుంటే మార్చి 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూటమి సర్కార్.
CRDA 2014లో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పేర్కొన్నట్లు చట్టంలో సవరణ చేయనుంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాలపరిమి పూర్తికావడంతో సవరణ బిల్లులో అమరావతిని చేర్చింది కేంద్రం. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని సవరణ బిల్లులో పొందుపరిచారు. బిల్లు ఆమోదం పొందాక కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేయనున్నారు. పార్లమెంటు ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తరువాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో అమరావతికి చట్టబద్ధత లభించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..