
- హరీశ్.. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్?: విప్ బీర్ల అయిలయ్య
- కేటీఆర్, హరీశ్‌రావే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడిండు: ఆది శ్రీనివాస్
- పదేండ్ల అధికారంలో బూడిద, బొగ్గు, ఇసుక దేన్నీ వదల్లేదు: వేముల విరేశం
- సీఎల్పీలో విప్‌ల ప్రెస్ మీట్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నిజాలు బయటపెట్టిండని, మరి ఇప్పుడు హరీశ్ రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ అని విప్ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. మంగళవారం సీఎల్పీలో సహచర విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు.
పదేండ్లు పాల డైరీ పెట్టి హరీశ్ దోచుకున్నాడని, ఆయన దోపిడీని చూసే కేసీఆర్ ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారని ఆరోపించారు. ఇప్పుడు బావా బామ్మర్దులు బీఆర్ఎస్‌పై ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తవడం ఖాయమన్నారు. రేవంత్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ ఇద్దరు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారు: ఆది శ్రీనివాస్
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్, హరీశ్‌కు మైక్ ఇస్తే అన్నీ పచ్చి అబద్ధాలే మాట్లాడారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులు 13 గంటలు మాట్లాడితే.. బీఆర్ఎస్ సభ్యులు 16 గంటలు మాట్లాడారన్నారు. ఇంత సమయం ఇచ్చినా ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ 16 గంటల్లో ఆ ఇద్దరే ఎక్కువ సమయం మాట్లాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా వారి గొంతును నొక్కారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వచ్చిందీ లేదు, మాట్లాడిందీ లేదని అన్నారు.
అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ అబద్ధాలు: వేముల వీరేశం
ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలో వాస్తవాలను మాట్లాడాల్సిన కేటీఆర్, హరీశ్ అన్నీ అబద్ధాలనే మాట్లాడి సభను తప్పుదోవ పట్టించారని విప్ వేముల వీరేశం ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఈ ఇద్దరు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభా విలువలను దిగజార్చుతున్నారని, ప్రజాస్వామ్యం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి బూడిద, ఇసుక, బొగ్గు.. దేన్ని వదల్లేదని, మొత్తం తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.
హరీశ్ అక్రమాలపై విచారణ జరిపించాలి: విజయ రమణా రావు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు హరీశ్ రావు పదేండ్ల పాటు మంత్రిగా ఉన్న సమయంలో పాల్పడ్డ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని విప్ విజయ రమణా రావు కోరారు. పొంగులేటిపై ఉద్దేశపూర్వకంగా హరీశ్ ఆరోపణలు చేస్తుండని, అయినా సీబీసీఐడీ విచారణకు సిద్ధమని తమ ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. హరీశ్ రావు సాగునీటి మంత్రిగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి తీసుకున్న పర్సంటేజీలు, భూ దందాపై విచారణ చేయాలన్నారు.
ప్రజలకు ఉపయోగపడే బిల్లులకు ఆమోదం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే పది బిల్లులను ఆమోదింపజేసుకున్నామని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజల్లో రేవంత్ సర్కార్‌కు ఎక్కడ ఆదరణ వస్తుందేమోననే భయంతో బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై, తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సభలో బడ్జెట్ కాపీలను చింపి అనాగరికంగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారని, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.