Reading Time: 2 minutes
Ys Jagan Comments On Amaravati Resolution Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేవని, ఆయన దృష్టిలో పరిపాలన అంటే కేవలం అవినీతి, దోపిడీ మాత్రమేనని జగన్ దుయ్యబట్టారు.

గత వారం శాసనసభలో అమరావతిపై ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమని జగన్ విమర్శించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రానికి ‘రాజధాని’ అనే పదమే లేదని, కేవలం దేశానికి మాత్రమే రాజధాని ఉంటుందని స్వయంగా మంత్రి పార్థసారధి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు తమ రాజధానులను తామే నిర్ణయించుకున్నాయని తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ తీర్మానాల పేరుతో ఎందుకు డ్రామాలు ఆడుతోందని జగన్ ప్రశ్నించారు.

 
Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!
 

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. గతంలో 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు అవుతుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అదనంగా మరో 50 వేల ఎకరాలు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. చదరపు అడుగుకు రూ. 11 వేల నుండి రూ. 14 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. “ఏ స్కాములు లేకపోతే అంత ఖర్చు ఎందుకు అవుతుంది? అభివృద్ధికి అవసరమైన రెండు లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఈ ప్రాజెక్ట్ ఎన్నేళ్లకు పూర్తవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు.

ఐదున్నర గంటల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేవలం తనను , వైసీపీని దూషించడానికే సభను వాడుకున్నారని జగన్ మండిపడ్డారు. ఒకవైపు అసెంబ్లీని పిలిచిన ప్రభుత్వం, అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్‌ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కౌన్సిల్‌లో చంద్రబాబు అవినీతిని సభ్యులు కడిగిపారేస్తారనే భయంతోనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

New Income Tax Law: 1961 పన్ను చట్టానికి గుడ్‌బై.. అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మారిన 10 కీలక నిబంధనలు ఇవే!

భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చకుండా చట్టం తెస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ.. అసెంబ్లీలో చట్టసవరణలు చేసే అధికారం సభకు ఉంటుందన్న విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో సానుభూతి పొందడానికే చంద్రబాబు ఇటువంటి విన్యాసాలు చేస్తున్నారని, ఆయన అసలు రంగు ప్రజలందరికీ తెలుసని జగన్ స్పష్టం చేశారు.

అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంలో పారదర్శకత ఎక్కడ ఉందని ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.