Reading Time: 2 minutes

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డౌన్ : అన్ని నగరాల్లోనూ తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Caption of Image.

భారత రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన 18 త్రైమాసికాల్లో ఎప్పుడూ లేని విధంగా.. 2026 జనవరి-మార్చి కాలంలో దేశంలోని టాప్-9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు లక్ష యూనిట్ల కంటే దిగువకు పడిపోయాయి. ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 13 శాతం క్షీణించి 98,761 యూనిట్లకు పరిమితమయ్యాయని  ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌ఈక్విటీ డేటా వెల్లడించింది.

రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనానికి కారణాలేంటి?

ఈ తగ్గుదల కేవలం డిమాండ్ లేకపోవడం వల్ల కాదంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా సప్లై కొరత అమ్మకాలు తగ్గటానికి కారణమని రిపోర్ట్ చెబుతోంది. కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు గతేడాదితో పోలిస్తే 19 శాతం తగ్గి 92,411 యూనిట్లకు పడిపోయాయి. అంటే కొనేవారు ఉన్నా.. మార్కెట్లోకి కొత్త ఇళ్ల ప్రాజెక్టులు రాకపోవటం వల్ల అమ్మకాలు తగ్గాయి. అయితే ఈ గందరగోళంలోనూ బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలు మాత్రం పాజిటివ్ గ్రోత్‌తో దూసుకుపోతున్నాయి. బెంగళూరు 17,991 యూనిట్లతో దేశంలోనే టాప్ సేల్లింగ్ మార్కెట్‌గా నిలిచింది.

హైదరాబాద్ రియల్టీ పరిస్థితి ఏమిటి?

భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం తగ్గాయి. కొత్త లాంచ్‌ల విషయంలోనూ హైదరాబాద్ రెండంకెల వృద్ధి పతనాన్ని నమోదు చేసి రియల్టర్లకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏ అనుమతుల్లో వేగం పెరిగినప్పటికీ.. పాత స్టాక్ ఇంకా క్లియర్ కాకపోవడంతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెనుకాడుతున్నారట. దీనికి తోడు ఐటీ కంపెనీల్లో హైరింగ్ తగ్గడం, లేఆఫ్స్ భయాలు హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లో ఇన్వెస్ట్ చేసేవారిని ఆలోచనలో పడేశాయి.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ముంబై, పూణె, థానే వంటి నగరాల్లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం సప్లై 89 శాతం పెరిగింది. మొత్తం మీద భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేషన్ దశలోకి ఎంటర్ అయ్యిందని అనలిస్టులు చెబుతున్నారు. అంటే ధరలు స్థిరపడి, కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి వస్తే తప్ప మళ్లీ అమ్మకాలు పెరగవని వారు అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇప్పుడు ఆచితూచి అడుగు వేయడం అవసరమని హెచ్చరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.