Reading Time: < 1 minute

హైదరాబాద్: ‘తెలంగాణ గర్వకారణం గద్దర్ అన్న.. జోహార్ గద్దర్ అన్న…మీ గొంతు నిశ్శబ్దం కాలేదు… ప్రజల గుండెల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పొన్నం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులను దేశం ముందుకు తీసుకువచ్చారన్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్లో గద్దర్ వంటి మహానుభావుడి పేరు ప్రస్తావన రావడం బాధాకరమైన విషయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే నాయకుడు అని, గద్దర్ లాంటి ప్రజాకళాకారులు, ఉద్యమయోధుల విలువను అర్థం చేసుకుని, వారి పోరాటాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అని పొన్నం తెలియజేశారు. 

అణగారిన వర్గాల స్వరం వినిపించేందుకు, వారి బాధలను దేశం ముందుకు తీసుకురావడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని, ప్రజల కోసం పాట పాడిన గొంతుకలను గౌరవించడం అని, ప్రజల కోసం పోరాడిన నాయకులను ఆదరించడం రాహుల్ గాంధీ ప్రత్యేకత అని కొనియాడారు. గద్దర్ లాంటి మహానుభావులు సమాజానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభాలు అని, అలాంటి వారిని కాపాడటం, గౌరవించడం, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం గొప్ప అని పొన్నం పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతను రాహుల్ గాంధీ నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. 

గద్దర్ అంటే కేవలం ఒక కళాకారుడు కాదు అని, ప్రజల బాధలను తన గొంతులో మోసిన గొంతుక అని, అణగారిన వారి కన్నీళ్లకు స్వరం ఇచ్చిన పోరాటయోధుడు అని, ఆయన పాటలు వినిపించేవి కాదని, వేడి రక్తాన్ని కదిలించేవని, అన్యాయంపై తిరుగుబాటు రగిలించేవని, తెలంగాణ మట్టిలో ప్రతి గుండె చప్పుడు లా మారేవని మెచ్చుకున్నారు.  ఈ నేల కోసం…నీళ్ల కోసం…నిజమైన హక్కుల కోసం…తన జీవితం మొత్తం అంకితం చేసిన మహానుభావుడు గద్దర్  అని ప్రశంసించారు. 

అలాంటి మహోన్నత వ్యక్తిని అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని కాదు అని, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూడటమేనని, గద్దర్ పాటలు కేవలం స్వరాలు కావు అని, అవి ఒక ఉద్యమ చరిత్ర, అవి ఒక తరానికి ప్రేరణ, అవి న్యాయం కోసం ఎప్పటికీ మసకబారని జ్యోతి అని పొన్నం తెలిపారు.