
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన జాతీయ అవసరాల కోసం ఏటీఎంలా వాడుకుంటోందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కనపెట్టి, ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఇక్కడి నిధులను తరలిస్తున్నారన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరగాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక10 రోజుల్లోనే మమ అనిపించిందని విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మంత్రులు ఎగతాళి చేయడం దురదృష్టకరమన్నారు. జాతీయ గీతాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని ప్యానల్ స్పీకర్‌గా నియమించడం దేశానికే అవమానకరమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణ జరపకుండా, కేవలం బ్యారేజీలకే పరిమితం చేయడం వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకూ బీజేపీ పోరాటం ఆగదని పేర్కొన్నారు. రైతు బకాయిలు, నిరుద్యోగుల సమస్యలపై చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, కప్పర ప్రసాదరావు, మీడియా ప్యానెలిస్టులు రాజు ముదిరాజ్, ప్రభా గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.