
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, జెట్ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై సవరించిన ఇంధన చార్జీలను విధించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ సవరణల ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమానాలపై రూ.275 నుంచి రూ.10,000 వరకు ఇంధన చార్జీలు విధించబడతాయి. దీంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇదే రోజున విమాన ఇంధనమైన ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్‌ఫ్యుయెల్) ధరలు సవరించగా, ప్రభుత్వం దేశీయ విమానాల కోసం వాటిని కేవలం 25 శాతం మేరకు మాత్రమే పెంచినట్లు వెల్లడించింది.
మార్చి 14 నుంచే ఇండిగో, ధరల పెరుగుదల కారణంగా రూ.425 నుంచి రూ.2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తూ వస్తోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి కొత్త ఇంధన చార్జీలు రూ.275 నుంచి రూ.950 వరకు ఉండనున్నాయి. ‘ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ఇంధన చార్జీలను మళ్లీ సవరించాం’ అని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి ఈ చార్జీలు రూ.900 నుంచి రూ.10,000 వరకు ఉండనున్నాయి. ‘గత నెలలో అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించే ఏటీఎఫ్ ధరలు రెండింతలకుపైగా పెరిగాయి. దీనివల్ల ఆ మార్గాలపై నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని ఇండిగో తెలిపింది. ఈ సవరించిన చార్జీలు ఏప్రిల్ 2 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని పూర్తిగా టికెట్ ధరలపై మోపాలంటే భారీగా పెంచాల్సిన అవసరముందని సంస్థ పేర్కొంది. అయితే ప్రయాణికులపై భారం తగ్గించే ఉద్దేశంతో తక్కువ మొత్తాన్నే పెంచినట్లు ఇండిగో వెల్లడించింది.