
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 11 కీలక ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేసింది. ఆరో విడతలో భాగంగా అమ్మకానికి ఉంచిన ఈ బ్లాకులకు ఇన్వెస్టర్ల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతోపాటు, తగినంత మంది బిడ్డర్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దేశీయంగా ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది కొంత ఎదురుదెబ్బగా మారింది. ఐదు బ్లాకులకు అసలు బిడ్లే దాఖలు కాలేదు. మరో ఐదు బ్లాకులకు ముగ్గురు కంటే తక్కువ బిడ్డర్లు మాత్రమే రావడంతో వేలం నిలిపివేశారు.
పశ్చిమ బెంగాల్లోని బేకు రేర్ మెటల్ బ్లాక్ వేలం కూడా రద్దయింది. 13 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23 ఖనిజ బ్లాకుల కోసం గత ఏడాది సెప్టెంబర్లో ఆరో విడత వేలం ప్రారంభమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్లాకులు ఉన్నాయి. వీటిలో లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నియోబియం, టాంటాలమ్, వెనాడియం వంటి అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి.