
టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రులు రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లియాండర్ పేస్ పోటీ చేసే అవకాశం ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 23,29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పార్టీలో చేరే అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది టికెట్ వ్యవహారం కాదని, ఇదో బాధ్యతని చెప్పారు. ‘ ఖేలో ఇండియా’తో దేశానికి, యువతకు సేవ చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. యువతకు ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే అంకిత భావంతో యువతపై తాను దృష్టిసారిస్తానని చెప్పారు.
లియాండర్ పేస్‌కు కోల్‌కతా వంటి అర్బన్ ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆయనను పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. పేస్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌తో ఎగువ మధ్య తరగతి ఓటర్లు, పట్టణ ప్రాంత నియోజక వర్గాలు, క్రీడాభిమానులను మరింతగా ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. దేశం లోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన లియండర్‌పేస్, టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. బెంగాల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. కోల్‌కతాలో పుట్టిన పేస్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు నడిచారు. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్‌స్కామ్ టైటిళ్లు గెలిచారు. అందులో 10 మిక్స్‌డ్ డబుల్స్‌లో 8 పురుషుల డబుల్స్‌లో నెగ్గారు. రాకెట్ వదిలి, 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.